abhinandan: మన పైలట్ కు పాక్ లో పెరుగుతున్న మద్దతు.. విడుదల చేయాలంటూ ఇమ్రాన్ ను కోరిన ఫాతిమా భుట్టో
- శాంతి, మానవత్వాలపై మన చిత్తశుద్ధిని నిరూపించుకుందాం
- యుద్ధరంగంలో ఇప్పటికే ఒక జీవితకాలాన్ని గడిపాం
- భారత్ తో శాంతియుతంగా ఉన్న సందర్భాన్ని ఇంత వరకు చూడలేదు
పాక్ సైన్యం అధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను విడిపించేందుకు మన ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఇదే సమయంలో అభినందన్ కు పాకిస్థాన్ లో కూడా మద్దతు పెరుగుతోంది. అభినందన్ ను విడుదల చేయాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె ఫాతిమా భుట్టో విన్నవించారు. శాంతి, మానవత్వం, గౌరవాలపై మనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి అభినందన్ ను విడుదల చేయాలని తనతో పాటు ఎంతో మంది పాక్ యువత కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
'ఇప్పటికే మనం యుద్ధరంగంలో ఒక జీవితకాలాన్ని గడిపాం. పాక్ సైనికులు మళ్లీ చనిపోవాలని నేను కోరుకోను. భారత్ సైనికులు ప్రాణాలు కోల్పోవాలని ఆకాంక్షించను. మన ఉపఖండం అనాథలతో నిండిపోకూడదు. మన పొరుగుదేశంతో మనం శాంతియుతంగా ఉన్న సందర్భాన్ని నేను ఇంత వరకు చూడలేదు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ట్విట్టర్ అకౌంట్ల ద్వారా యుద్ధం జరుగుతుండటాన్ని కూడా ఎన్నడూ చూడలేదు' అని ఫాతిమా భుట్టో అన్నారు. 36 ఏళ్ల పాతిమాకు మంచి రచయిత్రిగా పేరుంది.