India: ‘సంఝౌతా ఎక్స్ ప్రెస్’ రైలు సర్వీసును నిలిపివేసిన పాకిస్థాన్!
- భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా సర్వీసు నిలిపివేత
- నేడు కేబినెట్ తో ప్రధాని మోదీ సమావేశం
పాకిస్థాన్ లోని బాలాకోట్ ఉగ్రస్థావరంపై భారత వైమానికదళం(ఐఏఎఫ్) దాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ కు చెందిన ఓ ఎఫ్-16 విమానాన్ని కూల్చేశామని భారత్ ప్రకటించగా, ఇండియాకు చెందిన రెండు విమానాలను కూల్చివేశామనీ, ఐఏఎఫ్ పైలెట్ అభినందన్ ను అరెస్ట్ చేశామని పాక్ ప్రకటించింది. తాజాగా ఇరుదేశాల మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును నిలిపివేస్తున్నట్లు పాక్ తెలిపింది.
లాహోర్(పాక్) నుంచి అట్టారి(భారత్) వరకూ నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ నిలిపివేస్తున్నట్టు చెప్పింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు కేబినెట్ సమావేశం కానుంది.
అలాగే త్రివిధ దళాధిపతులతో పాటు నిఘావర్గాల ఉన్నతాధికారులతో మోదీ ఈరోజు సమావేశం కానున్నారు. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు మరోసారి మద్దతు ప్రకటించాయి.