Pawan Kalyan: యుద్ధం రాబోతోందని నాకు రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు చెప్పారు: పవన్ కల్యాణ్
- మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు
- దేశభక్తి వారిలో మాత్రమే ఉన్నట్టు బీజేపీ ప్రవర్తిస్తోంది
- ఆశయ సాధన కోసం ప్రాణాలు కూడా లెక్క చేయను
బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు చెప్పారని అన్నారు. దీన్నిబట్టి మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి కేవలం వారిలో మాత్రమే ఉన్నట్టు బీజేపీ ప్రవర్తిస్తోందని... వారి కంటే 10 రెట్లు అధికంగా మనకూ ఉందని చెప్పారు.
మన దేశంలో హిందువులు ఎంతో ముస్లింలు కూడా అంతేనని... ముస్లింలు దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. హిందువులకు పాకిస్థాన్ లో ఎలాంటి స్థానం ఉందో తనకు తెలియదని... కానీ ముస్లింలను భారత్ గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పారు.
రాయలసీమ యువతలో మార్పు రావాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. సమాజానికి ఎంతో చేయాలని అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని... కానీ సాధ్యపడలేదని చెప్పారు. తన ఆశయాలను సాధించేంత వరకు శ్రమిస్తూనే ఉంటానని... ప్రాణాలను కూడా లెక్కచేయనని తెలిపారు.