new delhi: వైమానిక దాడులపై పాకిస్థాన్ పలుసార్లు మాట మార్చింది: త్రివిధ దళాల అధికారులు

  • నిన్న  పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకొచ్చాయి
  • వాటి రాకను మన రాడార్లు గుర్తించాయి
  • మన వైమానిక దళాలు వాటిని తిప్పికొట్టాయి

త్రివిధ దళాల అధికారులు ఈ రోజు ఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల ప్రతినిధులు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, ఆర్మీ మేజర్ జనరల్ సురేంద్ర సింగ్, నేవీ రేర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్ మాట్లాడారు. వైమానిక దాడులపై పాకిస్థాన్ పలుసార్లు మాట మార్చిందని, నిన్న మన భూభాగంలోకి పాక్ విమానాలు చొచ్చుకొచ్చాయని, పాక్ యుద్ధ విమానాల రాకను మన రాడార్లు గుర్తించాయని అన్నారు. భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ విమానాలు దాడులకు దిగాయని, మన వైమానిక దళాలు వాటిని తిప్పికొట్టినట్టు చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పది గంటలకు పాక్ విమానాలు మన భూభాగంలోకి చొరబడటాన్ని గమనించామని, వెంటనే భారతీయ వైమానిక దళం స్పందించిందని ఆర్జీకే కపూర్ పేర్కొన్నారు.
 
మిగ్ 21, సుఖోయ్, మిరాజ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయని, తమ దాడిలో పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాయని అన్నారు. ఎఫ్-16 విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూలిందని, ఈ ఆపరేషన్ లో భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-21ను కోల్పోయామని చెప్పారు. ఇద్దరు పైలట్లు తమ అధీనంలో ఉన్నారంటూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసిందని, కేవలం ఉగ్ర శిబిరాలపై దాడి చేయడానికి మాత్రమే ఆపరేషన్ చేపట్టాం కానీ, పాక్ మాత్రం భారతీయ మిలటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించిందని అన్నారు. ఎఫ్-16 విమానాలు వాడలేదంటూ పాక్ కట్టుకథలు చెప్పిందని, అయితే, ఎఫ్-16 విమానాలు వాడిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

గగనతలంలో ఏ దేశం విమానం వెళ్తుందో గుర్తించే సాంకేతికత తమ వద్ద ఉందని, భారత వైమానిక దళం అన్ని వేళలా సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తమ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, అయితే, ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారన్నది ఇంకా తేలలేదని అన్నారు. తమ లక్ష్యాలను వంద శాతం చేరుకున్నామని, పాక్ కు పట్టుబడ్డ భారత పైలట్ అభినందన్ విడుదల ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 27న ఆర్మీ స్థావరాలపై దాడికి పాకిస్థాన్ ప్రయత్నించిందని చెప్పిన సురేంద్ర సింగ్, ఎల్వోసీ వెంబడి పధాతి దళాలు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నాయని, దేశ రక్షణకు, ఈ ప్రాంత పరిరక్షణకు ఆర్మీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మన భూభాగంలోకి పాకిస్థాన్ ఏ రకంగా చొరబడేందుకు యత్నించినా గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

భారతీయ నావికా దళం సర్వసన్నద్ధంగా ఉందని డీఎస్ గుజ్రాల్ పేర్కొన్నారు. దేశ రక్షణకు నేవీ ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. కాగా, భారత భూభాగంలోకి చొరబడ్డ పాక్ విమానాల కూల్చివేతకు సంబంధించిన శకలాలను చూపారు.

  • Loading...

More Telugu News