prayag raj: అందుకే, ప్రయాగ్ రాజ్ లో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగింది: ప్రధాని మోదీ
- ప్రయాగ్ రాజ్ లో పరిశుభ్రతతో ప్రశంసలు దక్కాయి
- పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు శ్రమ పడ్డారు
- ఈ విషయం నన్ను ఆలోచింప చేసింది
ఇటీవల ప్రయాగ్ రాజ్ లో అర్ధ కుంభమేళాలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గంగా నది పవిత్రతను కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్రను మోదీ ప్రశంసించడమే కాదు వారి పాదాలు కడిగి ఆపై దుశ్శాలువాలతో సన్మానించారు. దీంతో, ప్రధాని అంతటి వ్యక్తి ఇలా చేయడంపై ప్రశంసలు కురిశాయి. అదే సమయంలో, విమర్శలు గుప్పించిన వారూ ఉన్నారు. ఈ విమర్శలు చేసిన వారికి మోదీ సమాధానిమిచ్చారు. తాను ఇలా చేసింది ఎన్నికల గిమ్మిక్కు కాదని, తనకు ఉన్న విలువల వల్లే అలా చేశానని మోదీ స్పష్టం చేశారు.
బూత్ స్థాయి కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానమిచ్చారు. ఈ విషయమై మోదీపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మహారాష్ట్రలోని పుణెకు చెందిన బీజేపీ కార్పొరేటర్ మోదీని ప్రశ్నించారు. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ లో అక్కడి పరిశుభ్రత కారణంగా ఆ ప్రాంతానికి అందరి ప్రశంసలు దక్కాయని అన్నారు. అర్థ కుంభమేళాకు దాదాపు 22 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని, ఈ ప్రాంతం పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు పడ్డ శ్రమ తనను ఆలోచించేలా చేసిందని, అందుకే, వారి కాళ్లు కడిగి తన కృతజ్ఞతలు తెలియజేయాలనుకుని, అలా చేశానని మోదీ వివరించారు.