Andhra Pradesh: కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ..విశాఖ రైల్వేజోన్ కు ఆమోదం
- జమ్ముకశ్మీర్ రిజర్వేషన్లపై రెండు కీలక నిర్ణయాలు
- ఎల్వోసీ వద్ద నివసించే వారికి రిజర్వేషన్లు
- 10 శాతం ఈబీసీ కోటా జమ్ముకశ్మీర్ కు వర్తిస్తుంది: అరుణ్ జైట్లీ
కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ఏపీలోని విశాఖపట్టణంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్లషై రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన సవరణ ఆర్డినెన్స్ కు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు.
ఎల్వోసీ వద్ద నివసించే వారికి రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదించిందని, 97వ సవరణ జమ్ముకశ్మీర్ కు వర్తించేందుకు,10 శాతం ఈబీసీ కోటా జమ్ముకశ్మీర్ కు వర్తించేందుకు ఆమోదం లభించిందని అన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నాలుగు లైన్ల వంతెన నిర్మించేందుకు, హర్యానాలోని మనేథీలో ఎయిమ్స్ నిర్మాణానికి, గుజరాత్ లోని రాజ్ కోట్, హిరసార్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్టు చెప్పారు.