Hamza Bin Laden: లాడెన్ కుమారుడు పాకిస్థాన్ లోనే... ఆచూకీ చెబితే రూ. 7 కోట్లు!
- పట్టించినా, ఆచూకీ చెప్పినా బహుమతి
- అల్ ఖైదాకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుంది
- యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ ప్రకటన
ఇంటర్నేషనల్ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్, ప్రస్తుతం పాకిస్థాన్ లోనే తలదాచుకున్నాడని, అతని ఆచూకీ చెబితే మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.16 కోట్లు) రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. హంజా బిన్ లాడెన్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉండివుండవచ్చని, ఒకవేళ అక్కడ లేకుంటే ఇరాన్ లో ఉండివుంటాడని అనుమానం వ్యక్తం చేసిన అమెరికా, అతన్ని పట్టించినా లేదా ఆచూకీ చెప్పినా బహుమతి ఇస్తామని వెల్లడించింది.
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖైల్ ఇవనాఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ ఖైదాకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, లాడెన్ ను మట్టుబెట్టిన తరువాత ఉగ్ర సంస్థకు హంజా బిన్ లాడెన్ నాయకుడయ్యాడని అన్నారు. ఇంటర్నెట్ లో అతని ఆడియో, వీడియో సందేశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. కాగా, జనవరి 2017లో హంజా బిన్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.