Hyderabad: ఉగ్రవాదులు మారువేషాల్లో వచ్చినా పసిగడతాయి.. హైదరాబాద్ లో అత్యాధునిక నిఘా సాఫ్ట్ వేర్

  • ఢిల్లీ తర్వాత హైదరాబాద్ లోనే ఇటువంటి సీసీ కెమేరాలు
  • సరిహద్దుల్లో ఉద్రిక్తల దృష్ట్యా నగరంలో నిఘా కట్టుదిట్టం
  • ఉగ్ర బాధిత నగరాల్లో మూడోదీ ట్యాంక్‌బండ్‌ నగరం

దేశంలో ఎక్కడ బాంబు పేలినా ఆ మూలాలు హైదరాబాద్‌ నగరంలో ఉన్నట్లు పలు సందర్భాల్లో నిఘా సంస్థలు గుర్తించాయి. అందుకే తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తల దృష్ట్యా భద్రతాబలగాలు నగరంలో నిఘా  కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాయి. సైన్యంతో సరిసమానంగా విధులు నిర్వహించే ఆక్టోపస్‌, స్వాట్‌ (స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌)లను రంగంలోకి దించారు.

విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, రక్షణ సంస్థల స్థావరాలు, కొన్ని బహుళ అంతస్తుల భవనాల వద్ద బలగాలను మోహరించారు. ఉగ్రవాదులు మారువేషాల్లో, ముఖకవళికలు మార్చుకుని వచ్చినా గుర్తించేందుకు వీలుగా సీసీ కెమెరాల్లో ఫేసియల్‌ రికగ్ననైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఈ సదుపాయం ఉంది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు ఉగ్రవాదులు తమ పరిధిలోకి రాగానే పోలీసులను అప్రమత్తం చేస్తాయి.

అలాగే పాతబస్తీ, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో పెట్రోలింగ్‌ నిర్వహించే సిబ్బంది చేతికి ల్యాప్‌టాప్ లు, అత్యాధునిక కెమెరాలు అందించారు. అపరిచితులు తారసపడితే వారి వేలిముద్రలు, పేరు నమోదు చేస్తే వారి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఉగ్రవాద సానుభూతిపరుల వివరాలు తెలుసుకునేందుకు  ‘నో యువర్‌ నైబర్‌, టెనెంట్‌ వెరిఫికేషన్‌’ పేరుతో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులు సోషల్‌ మీడియాలో మాట్లాడుకునేటప్పుడు పసిగట్టేందుకు వీలుగా వాటిపై నిఘా పెట్టారు. దేశంలోని ఉగ్రబాధిత నగరాల్లో ఢిల్లీ, ముంబయి తర్వాత  స్థానం హైదరాబాద్ దే. అందుకే పుల్వామా ఉగ్రదాడి అనంతర ఘటనలతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా భద్రతా దళాలు ఈ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాయి. లష్కరే తోయిబా, ఇండియన్‌ ముజాహిదీన్‌, సిమి, హుజి, ఐసిస్‌ వంటి సంస్థల సభ్యులు దశాబ్దాలుగా ఇక్కడ తిష్టవేసి నగరంలో పలుమార్లు విధ్వంసాలకు పాల్పడిన సందర్భాలున్నాయి. 

  • Loading...

More Telugu News