Mukku Ugranarasimhareddy: "మీరు టీడీపీలోకి వస్తే బాగుంటుంది"... కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు కార్యాలయం ఫోన్!
- కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
- సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగానే
- నేటి సాయంత్రం టీడీపీలో చేరిక
ఆ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ప్రజల్లో సదభిప్రాయం ఉందని ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి కావడంతో, అదే నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, చంద్రబాబు కార్యాలయం ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించింది. ఆయనే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి. కనిగిరి మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం కనిగిరి ఎమ్మెల్యేగా కదిరి బాబూరావు కొనసాగుతుండగా, ఉగ్రనరసింహారెడ్డిని కూడా చేర్చుకుంటే తిరుగుండదని, ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మరొకరిని ఎమ్మెల్సీని చేయవచ్చని భావించిన చంద్రబాబు, ఉగ్రను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కనిగిరి ప్రాంతంలో ఉగ్రసేన పేరిట విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, గత ఐదేళ్లుగా ప్రజలకు దగ్గరైన ఆయన చురుకుదనాన్ని గమనించిన చంద్రబాబు, ఇటీవలి కాలంలో ఉగ్ర సిఫార్సులను అనుసరించి ఎంతో మందికి సీఎం సహాయనిధి నుంచి డబ్బులిచ్చారు. ఆరు నెలల క్రితం వరకూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, అదే పార్టీలో కొనసాగితే, రాజకీయ భవిష్యత్తు కష్టమవుతుందన్న ఆలోచనతో, పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.
ఇక తాజాగా, సీఎం కార్యాలయం నుంచి ఫోన్ రావడం, చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరాలని కోరడంతో, తన అభిమానులు, అనుచరులతో కలిసి చేరుతానని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ లో నేటి సాయంత్రం జరిగే కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ఉగ్రను పార్టీలో చేర్చుకోనున్నారు.