West Bengal: మీరు ప్రగల్భాలు పలకగలరు...మనిషిని కోల్పోతే బాధేంటో నాలాంటి వారికే తెలుస్తుంది : అమర జవాను భార్య మిథా

  • ఇంట్లో కూర్చుని మాట్లాడడం సులువు
  • మా ఆవేదన అటువంటి వారికి అర్థం కాదు
  • ఇటువంటి వారి వ్యాఖ్యలకు విలువ ఇవ్వకూడదు

పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలనుకోవడం కంటే చర్చలు, సంప్రదింపులు మంచిదని, పాకిస్థాన్‌ చేతికి చిక్కిన పైలెట్‌ను చర్చలతోనే క్షేమంగా తీసుకురావాలన్న తన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడిన ట్రోలర్లకు ఓ అమర జవాను భార్య ఘాటైన సమాధానం ఇచ్చారు.

 ‘కొందరు ఇంట్లో కూర్చుని పెద్దపెద్ద మాటలు చెబుతారు. ప్రగల్భాలు పలుకుతారు. కానీ తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినైనా ఆర్మీ, నేవీ, వాయు సేనల్లోకి పంపించాలని అనుకోరు. అందుకే వారికి నాలాంటి వారి మనోవేదన అర్థం కాదు’ అంటూ జవాబిచ్చారు. ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన బబ్లూ సంత్రా ఒకరు. ఈ దాడి తర్వాత భారత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేయడం, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, భారత్‌ పైలట్‌ అభినందన్‌ విక్రమ్‌ పాక్‌కు బందీగా చిక్కడం తెలిసిందే.

దీంతో పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని సామాజిక మాధ్యమాల్లో పలువురు అభిప్రాయపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలపై స్పందించిన అమర జవాను బబ్లూ సంత్రా భార్య మిథా ‘యుద్ధం వల్ల ఇరు దేశాల సైనికుల ప్రాణాలు పోతాయి. అందువల్ల భారత్‌ చర్చలకే మొగ్గు చూపాలి’ అని  అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలర్లు విమర్శలు కురిపించడంతో మిథా దీటుగా సమాధానమిచ్చారు.

‘శాంతిని ఆకాంక్షించినందుకు నన్ను యుద్ధ వ్యతిరేకినని చెబుతున్నారు. నా భర్తపై ప్రేమను శంకిస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఇన్ని మాటలు చెప్పే ఇటువంటి వారు సైన్యంలో ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు మాత్రం ముందుకు రారు. ఇటువంటి వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ప్రతి విమర్శ చేశారు. ఆధునిక చరిత్రలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన మిథా  ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

భర్త మరణానంతరం సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం చేయమని ఆమెను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఆరేళ్ల బిడ్డ, ఒంటరిగా ఉన్న అత్తగారిని వదిలి రాలేనని, తనకు సాధారణ ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఇవ్వాలని భారత్‌ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News