renuka chowdary: పాకిస్థాన్ నిర్ణయం ‘అభినంద'నీయం: రేణుకాచౌదరి
- పైలట్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషం
- ఇటువంటి సందర్భాల్లో దేశం అంతా ఒక్క గొంతుక కావాలి
- ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి
దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చిక్కిన మన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ని విడుదల చేయాలని దాయాది దేశం సముచిత నిర్ణయం తీసుకుందని, ఆ దేశ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్న ఆమె అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్థాన్‌తో సంబంధాలపై మాట్లాడుతూ ఇటువంటి సందర్భాల్లో దేశప్రజలంతా ఒక్క గొంతుకై నిలిచినప్పుడే మన బలం ప్రపంచానికి తెలిసి వస్తుందన్నారు. దేశభద్రత విషయంలో ఇతరత్రా ఆలోచనలు సరికాదన్నారు. ఇక, రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీని బీజేపీ ప్రభుత్వం అమలు చేసి తీరాలని రేణుక సూచించారు. ప్రత్యేక హోదాయే కాకుండా విభజన హామీలన్నింటినీ నెరవేర్చి నవ్యాంధ్రకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.