India: అభినందన్ విడుదల నేపథ్యంలో.. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేసిన బీఎస్ఎఫ్!
- వాఘా-అట్టారికి భారీగా చేరుకున్న ప్రజలు
- ఇలాంటి పరిస్థితిలో కార్యక్రమాన్ని నిర్వహించలేమన్న బీఎస్ఎఫ్
- అట్టారి సరిహద్దుకు చేరుకున్న ఐఏఎఫ్ అధికారులు, కుటుంబ సభ్యులు
భారత్-పాకిస్థాన్ ల మధ్య వాఘా-అట్టారి బోర్డర్ వద్ద మధ్య రోజూ సూర్యాస్తమయం సమయంలో జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ప్రకటించింది. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఇక్కడకు ప్రజలు భారీ సంఖ్యలో చేరుకున్న విషయాన్ని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బీటింగ్ రిట్రీట్ ను నిర్వహించడం కష్టమవుతుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సందర్శకులు వాఘా వద్దకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశామని చెప్పింది.
మరోవైపు అభినందన్ విడుదలకు సంబంధించిన పత్రాలను పాకిస్థాన్ లోని భారత హైకమిషన్ దాయాది దేశానికి అప్పగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అభినందన్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు వాయుసేనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు భారతీయులు భారీ సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్నారు. కాగా, మిలటరీ ప్రోటోకాల్ నేపథ్యంలో తాను అభినందన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.