Andhra Pradesh: ఏపీని మరో బీహార్ చేద్దామని జగన్ కుట్రపన్నారు!: సీఎం చంద్రబాబు ఆరోపణ
- వైసీపీ నేర, చిల్లర రాజకీయాలు చేస్తోంది
- మోదీని నిలదీసే ధైర్యం కూడా వైసీపీకి లేదా?
- దమ్ముంటే మోదీ-కేసీఆర్-జగన్ ముసుగు తీసి పోటీ చేయండి
ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో నేరగాళ్లతో మనం పోరాటం చేయబోతున్నామని టీడీపీ నేతలతో ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేర, చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వస్తే కనీసం నిలదీసే ధైర్యం కూడా వైసీపీకి లేదా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ ను జగన్ తన రాజకీయ కన్సల్టెంట్ గా పెట్టుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిశోర్ ను రాజకీయ సలహాదారుగా పెట్టుకుని జగన్ ఏపీని మరో బీహార్ చేద్దామని కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుట్రలను అమలుకానివ్వబోమన్నారు. దమ్ము-ధైర్యం ఉంటే కేసీఆర్-మోదీ-జగన్ ముసుగు తొలగించి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఏపీలో నిజాయతీపరులంతా టీడీపీలో చేరుతున్నారనీ, దశాబ్దాల వైరాన్ని వీడి టీడీపీకి సంఘీభావం ప్రకటిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కర్నూలులో కోట్ల, కేఈ కుటుంబాలే ఇందుకు రుజువని తెలిపారు. అలాగే విజయనగరంలో బొబ్బిలి, గజపతిరాజులు ఏకమయ్యారని గుర్తుచేశారు.