Andhra Pradesh: ఏపీలో ఓట్లను తొలగించేందుకు వైసీపీ నేతలు దొంగలను ఊర్లలోకి పంపారు!: మంత్రి పరిటాల సునీత
- దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు జగన్ యత్నం
- ప్రభుత్వ పథకాలతో వైసీపీ కార్యకర్తలూ లబ్ధిపొందారు
- అనంతపురం కదిరిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
నేరప్రవృత్తి కలిగిన జగన్ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత, ఏపీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు దొంగలను వైసీపీ నేతలు ఊర్లలోకి పంపారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పరిటాల సునీత ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లను తొలగించాలని చంద్రబాబు ఎన్నడూ చెప్పలేదనీ, అది జగన్ తత్వమని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సైతం లబ్ధి పొందారని మంత్రి గుర్తుచేశారు. అలాంటప్పుడు రాబోయే ఎన్నికల్లో అసలు వైసీపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.