Andhra Pradesh: పులివెందులో ఆదినారాయణ రెడ్డిని మేం అడ్డుకోలేదు.. సున్నపురాళ్లపల్లిలో ప్రచారానికి వెళ్లితీరుతాం!: వైసీపీ నేత అవినాశ్ రెడ్డి
- శాంతిభద్రతల సమస్య అంటూ పోలీసులు చెప్పడం దారుణం
- మూడు రోజుల క్రితమే అనుమతులన్నీ తీసుకున్నాం
- పులివెందులలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో ఈరోజు జరగాల్సిన ‘రావాలి జగన్-కావాలి జగన్’ కార్యక్రమానికి వెళ్లకుండా వైసీపీ నేతలు అవినాశ్ రెడ్డి, సుధీర్ రెడ్డిలను పోలీసులు ఈరోజు గృహనిర్బంధం లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు వెళితే సున్నపురాళ్లపల్లిలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డికి వివరించారు. దీంతో అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలను బూచిగా చూపి తమను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నపురాళ్లపల్లిలో కార్యక్రమం కోసం 3 రోజుల క్రితమే అనుమతి తీసుకున్నామని వెల్లడించారు. తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు చివరి క్షణంలో కార్యక్రమానికి అనుమతి నిరాకరించారనీ, హౌస్ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. టీడీపీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు తాము ఏనాడూ అడ్డంకులు కల్పించలేదని అవినాశ్ రెడ్డి గుర్తుచేశారు.
గతంలోనూ తమను ఇలాగే అడ్డుకున్నారనీ, అప్పుడు కోర్టు అనుమతితో ప్రచారానికి వెళ్లామని వ్యాఖ్యానించారు. జమ్మలమడుగులో వైసీపీకి ప్రజలు పట్టంకట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అందువల్లే టీడీపీ నేతలు భయపడుతున్నారనీ, ఎవరు అడ్డుకున్నా సున్నపురాళ్లపల్లికి శాంతియుతంగా ప్రచారానికి వెళ్లితీరుతామని స్పష్టం చేశారు.