Pawan Kalyan: ఏడు కొండలవాడే సాక్ష్యం.. రాయలసీమను అభివృద్ధి చేసి చూపిస్తా: పవన్
- చిత్తూరు పర్యటనలో ఆవేశంగా ప్రసంగించిన పవన్
- రాయలసీమ ప్రజల్లో చైతన్యం ఎక్కువన్న జనసేనాని
- రాయలసీమ అంటే లక్ష కోట్లు తినే నాయకులు కాదన్న పవన్
పల్లకీలు మోసి మోసి భుజాలు ఒరుసుకుపోయాయని, ఇక ఆపేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు పర్యటనలో జనసేనాని కాస్తంత ఆవేశంగా మాట్లాడారు. జనసేన అనేదే లేకపోతే టీడీపీ, వైసీపీలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 60:40 చొప్పున పంచుకుంటాయని విమర్శించారు. రాయలసీమ ప్రజల్లో చైతన్యం ఎక్కువ కాబట్టే ఎక్కువమంది సీమ నేతలు ముఖ్యమంత్రులు అయ్యారన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్తో తనకు వైరం లేదని పవన్ స్పష్టం చేశారు. రాయలసీమలో తనకు బలం లేదని తనను వెటకారం చేశారని, తన బలమెంతో చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. రూపాయి పెట్టుబడి లేకుండా జనబలాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ చెప్పుకొచ్చారు. తెలంగాణలో నోరు విప్పితే ఎక్కడ దాడులు చేస్తారోననే ఉద్దేశంతో ఆంధ్రా నాయకులు నోరు మెదపడం లేదని ఆరోపించారు.
రాయలసీమను ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తానని ఏడుకొండలవాడి సాక్షిగా, పీర్ బాబా సాక్షిగా చెబుతున్నానని పవన్ అన్నారు. అనంతపురంలో ఒక్క కియా కార్ల పరిశ్రమను పెట్టి చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ అంటే లక్షల కోట్లు తినే నాయకులు కాదని, లక్ష ఉద్యోగాలు కల్పించడమే జనసేన ధ్యేయమని పవన్ అన్నారు.