Narendra Modi: అదే మన దగ్గర రాఫెల్ విమానాలు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది: మోదీ
- స్వార్థ ప్రయోజనాల కోసం రాఫెల్ ఒప్పందాన్ని రాజకీయం చేశారు
- ఇప్పుడు దేశం మొత్తం రాఫెల్ గురించి మాట్లాడుతోంది
- కేవలం మోదీని వ్యతిరేకించాలన్న ఉద్దేశమే కనిపిస్తోంది
పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన దాడులను ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ సమయంలో మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ జెట్స్ లేకపోవడంతో దేశం మొత్తం బాధపడుతోంది’ అని ప్రధాని అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు రాఫెల్ జెట్స్ గురించి మాట్లాడుకుంటోందని, అవి మన వద్ద ఉండి ఉంటే పాక్ భూభాగంలో దాడుల ఫలితం మరోలా ఉండేదని అనుకుంటున్నారని మోదీ అన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్లో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం మోదీని వ్యతిరేకించాలని అనుకుంటే మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులు మరింత బలోపేతం అవుతారన్నారు. రాఫెల్ విషయంలో స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాంతం వల్ల దేశం ఇబ్బందులు పడుతోందన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదన్నారు. ప్రతిపక్షాల స్వార్థ ప్రయోజనం దేశానికి చేటు చేస్తుందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.