Andhra Pradesh: డ్యాష్ బోర్డు వివరాలను జగన్ అసెంబ్లీలో చదివారు.. అంటే ఆయన కూడా డేటాను దొంగతనం చేసినట్లేనా?: ధూళిపాళ్ల నరేంద్ర
- ఏపీపై బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి
- సీఎం డ్యాష్ బోర్డ్ వివరాలను ఎవరైనా చూడొచ్చు
- కుట్రలను చూస్తూ ఖాళీగా కూర్చోం.. బుద్ధి చెబుతాం
ఆంధ్రప్రదేశ్ పై వైసీపీ-టీఆర్ఎస్-బీజేపీలు కలిసి కుట్ర చేస్తున్నాయని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారంలో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న నేపథ్యంలో నరేంద్ర ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డులోని సమాచాారాన్ని ప్రజలు ఎవరైనా చదవొచ్చని నరేంద్ర తెలిపారు.
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా ఓసారి అసెంబ్లీలో సీఎం డ్యాష్ బోర్డులోని సమాచారాన్ని చదివారని నరేంద్ర గుర్తుచేశారు. అంటే జగన్ కూడా సమాచారాన్ని దొంగిలించినట్లేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల సేవలను వినియోగించుకుంటారని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్ కూడా అదే పని చేసిందన్నారు.
అయినా వైసీపీ నేతలు ఏపీ పోలీసులను కాకుండా తెలంగాణ పోలీసులను ఎందుకు ఆశ్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరూ కలిసి కుట్రలు చేస్తుంటే తాము ఖాళీగా కూర్చోబోమని హెచ్చరించారు. సరైన సమయంలో బుద్ధి చెప్పి తీరుతామని స్పష్టం చేశారు.