Chandrababu: బాలయోగికి ఘన నివాళి అర్పించిన చంద్రబాబు
- బాలయోగి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
- బాలయోగి సేవలను మరువలేమన్న సీఎం
- ఆయన స్మృతులు తన మనసులో పదిలంగా ఉంటాయన్న చంద్రబాబు
లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలయోగి గొప్ప నాయకుడని కొనియాడారు. లోక్ సభ స్పీకర్ గా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పారు. ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలు మరువలేనివని తెలిపారు. స్వతంత్ర భారతావనిలో ఒక దళితుడిని తాము లోక్ సభ స్పీకర్ ను చేశామని చెప్పారు. అప్పటి ప్రధాని వాజ్ పేయి తమకు 7 నుంచి 8 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధమయ్యారని... కానీ, తాము వద్దన్నామని తెలిపారు. అయితే ఒత్తిడి కారణంగానే రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని తీసుకున్నామని చెప్పారు.
వ్యక్తిగతంగా బాలయోగి తనకు ఎంతో ఆత్మీయుడని చంద్రబాబు అన్నారు. కోనసీమలో ఓఎన్జీసీకి సామాజిక బాధ్యతను గుర్తు చేయడానికి అప్పట్లో ఓ ఉద్యమాన్నే నడిపామని... దాన్ని బాలయోగి ముందుండి నడిపించారని చెప్పారు. కోనసీమలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. బాలయోగి స్మృతులు తన మనసులో పదిలంగా ఉంటాయని తెలిపారు.