Chandrababu: ఓడిపోతామన్న భయంతో ఇంత దిగజారుడా?: జగన్ పై చంద్రబాబు నిప్పులు!

  • ఎన్నికలు రాకముందే వైసీపీ భయం
  • టీడీపీ ఓటర్లను తొలగించే కుట్ర
  • ఎవరినీ వదిలిపెట్టబోను
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

ఎన్నికలు రాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామన్న విషయాన్ని గ్రహించి, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పూర్తి ఫ్రస్ట్రేషన్‌ లో కూరుకుపోయిన జగన్, తెలంగాణలో ఏపీ ప్రజలు, సంస్థలపై కేసులు పెట్టించే స్థితికి వచ్చేశారని నిప్పులు చెరిగారు.

తాము రెండు దశాబ్దాల నుంచి పార్టీ కార్యకర్తల సమాచారాన్ని క్రోడీకరించి దాచుకుంటే, తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగలించే నీచానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కోర్టు చీవాట్లు పెట్టడం వైసీపీ నీచానికి చెంపపెట్టని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఓటర్లను తొలగించే ప్రక్రియ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, అన్నింటికీ గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు.

 జగన్ చేస్తున్న దుర్మార్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని ఆక్షేపించిన ఆయన, 8 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శలు గుప్పించారు. బోగస్ పేర్లతో ఓట్లను తొలగిస్తున్న అందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు ఆందోళనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు, తప్పుడు దరఖాస్తుదారులను చట్టం ముందు నిలుపుతామని అన్నారు.

  • Loading...

More Telugu News