Narendra Modi: అదుగో, మీరు మళ్లీ దొరికిపోయారు!: ప్రధానిపై రాహుల్ విమర్శ
- మరో అబద్ధం ఆడారు మోదీ
- సిగ్గనిపించడంలేదా మీకు!
- ప్రధాని అమేథీ పర్యటనపై రాహుల్ విసుర్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు అమేథీలో పర్యటించి ఏకే-203 రైఫిళ్ల తయారీకి పచ్చజెండా ఊపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తనకు అలవాటైన రీతిలో మరో అబద్ధం ఆడేశారంటూ వ్యాఖ్యానించారు.
"2010లో నేను అమేథీలో ఆయుధాల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశాను. అప్పటినుంచి ఎన్నో ఏళ్లుగా అక్కడ చిన్న తరహా ఆయుధాలు తయారవుతున్నాయి. కానీ ఆదివారం నాడు మీరు అమేథీ వెళ్లి యథాప్రకారం ఓ అబద్ధం ఆడేశారు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా!" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
ఇప్పుడేదో కొత్తగా తాను ఆయుధ కర్మాగారం స్థాపించినట్టు ప్రధాని ప్రచారం చేసుకోవడం ఆయన సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అంటూ రాహుల్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. అమేథీ ఆయుధ కర్మాగారం క్రెడిట్ అంతా తనదేనని మోదీ చెప్పుకుంటున్నారని విమర్శించారు.
అంతకుముందు ఆదివారం నాడు మోదీ మాట్లాడుతూ... ఇక నుంచి అమేథీ అంటే ఓ కుటుంబం గురించే కాకుండా ఏకే-203 తుపాకుల ఉత్పత్తి కేంద్రంగా కూడా చెప్పుకుంటారని అన్నారు. అంతేకాదు, "2010లో ఆయుధ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మీ ఎంపీ ఎన్నో ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. కానీ వాళ్ల ప్రభుత్వ హయాంలోనే అది మూలనపడింది" అంటూ రాహుల్ గాంధీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకే రాహుల్ గట్టి కౌంటర్ ఇచ్చారు.