Pawan Kalyan: నేను ఆళ్లగడ్డలో మాట్లాడితే పాకిస్థాన్‌లో వినిపించింది: పవన్
- అరుపులు, కేకలతో మార్పు రాదు
- మంత్రి నారాయణపై తీవ్ర వ్యాఖ్యలు
- నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణప్రతిష్ఠ
తాను ఆళ్లగడ్డలో మాట్లాడిన మాటలు పాకిస్థాన్‌లో వినిపించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోరాట యాత్రలో భాగంగా నెల్లూరులో పర్యటిస్తున్న పవన్ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలపై స్పందించారు. తాను నెల్లూరు వీఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉండేది కాదన్నారు. నాటి నుంచి నేటి వరకు వ్యవస్థలో ఇసుమంతైనా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరుపులు కేకలతో మార్పు రాదని, లంచగొండితనం పోదని అన్నారు. ఆలోచనతో కూడిన నినాదంతోనే మార్పు వస్తుందని, ఆ మార్పు తానే కావాలని అనుకుంటున్నానని పవన్ అన్నారు. తాను ఆళ్లగడ్డలో మాట్లాడితే ఇస్లామాబాద్‌లో వినిపించిందన్నారు.
ఎన్నికలకు ముందు విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడం వల్ల బీజేపీపై అనుమానం మరింత పెరిగిందన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తే కుటుంబ పాలనకు చరమగీతం పాడొచ్చన్నారు. పనిచేయని నాయకుడిని చొక్కా పట్టుకుని నిలదీయాలని సూచించారు. ప్రభుత్వ విద్యను ఓ పద్ధతి ప్రకారం చంపేశారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ తాను అధికారంలోకి వస్తే మూసేసిన స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు గదుల ఇంట్లో ట్యూషన్ చెప్పిన నారాయణ.. నేడు జనరల్ ఆసుపత్రి స్థాయికి ఎదిగారని పవన్ విమర్శించారు.