Kadapa District: గతంలో బీఫారాలు ఇప్పించిన నేనే ఇప్పుడు వాటి కోసం తిరుగుతున్నా.. సిగ్గుగా ఉంది: డీఎల్ రవీంద్రారెడ్డి
- చంద్రబాబును కలిసి మాట్లాడా
- నాకు కనీస గౌరవం ఇవ్వకుండా మైదుకూరు టికెట్ ప్రకటించారు
- చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం
గత కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి క్రియాశీలం కావాలని యోచిస్తున్నారు. ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకు ఆయన స్పష్టత ఇవ్వలేదు. సోమవారం కడప జిల్లా ఖాజీపేటలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. తన మనసులోని ఆవేదనను వారితో పంచుకున్నారు.
40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతోమందికి బీఫారాలు ఇప్పించానని, ఇప్పుడీ వయసులో బీఫారం కోసం టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలను అడుగుతుండడం తనకే సిగ్గుగా ఉందన్నారు. ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న మేకల బాబును ఆదుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించానని, ఇప్పుడు ఆయనే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్ వద్ద డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
2014 ఎన్నికల తర్వాత టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ ఇంటికి వెళితే తన ఇంటికి రావొద్దని ఆయన హెచ్చరించారని డీఎల్ గుర్తు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కంటే ఏదైనా రాజకీయ పార్టీ పిలుస్తుందేమోనని చూశానన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పిలుపు వస్తే వెళ్లి కలిసినట్టు డీఎల్ తెలిపారు.
చంద్రబాబు తన గురించి గొప్పగానే చెప్పారన్న డీఎల్.. పెన్షన్‌ను వెయ్యి నుంచి రూ.2 వేలు చేయకపోతే మీ దగ్గరకు వచ్చే వాడిని కానని చంద్రబాబుకు చెప్పానన్నారు. కనుమ పండుగ రోజున కొందరు లబ్ధిదారులు తన వద్దకు వచ్చి ఆనందం వ్యక్తం చేసిన విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, ముఖ్యమంత్రిగా మీరొక్కరూ నీతిగా ఉంటే సరిపోదని, మంత్రులు, అధికారులు ఎంత సంపాదించారో చూడాలని ఆయనకు చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం మీ పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పానన్నారు.
చంద్రబాబు ఆకర్షించు.. వాడుకో.. వదిలెయ్ వంటి సిద్ధాంతాలను నమ్ముతారని, తనకు కనీస విలువ కూడా ఇవ్వకుండా, తనకు మాటమాత్రమైనా చెప్పకుండా మైదుకూరు టికెట్‌ను ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పునాదులు లేకుండా చేయాలని, తనకు ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడిస్తానని డీఎల్ ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గనని, మంచి రోజులు వస్తాయని, అధైర్య పడొద్దని కార్యకర్తలకు సూచించారు.