Narendra Modi: ఉగ్రవాదులకు మోదీ తీవ్ర హెచ్చరిక.. వేటాడి చంపుతామన్న ప్రధాని!
- ఓ పని అయిపోయింది కాబట్టి విశ్రాంతి తీసుకుంటామని పొరబడొద్దు
- భూమ్మీద ఎక్కడున్నా వదిలిపెట్టం
- మాకు జరిగిన నష్టానికి మూల్యం చెల్లించుకోక తప్పదు
పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల భరతం పట్టిన మోదీ ప్రభుత్వం మరో హెచ్చరిక జారీ చేసింది. సోమవారం అహ్మద్‌నగర్‌లో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిపిన దాడులు ఆరంభం మాత్రమేనని, ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు. ఒక పని అయిపోయింది కాబట్టి తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నామని భ్రమపడొద్దని, మరోటి మొదలవుతుందని అన్నారు.
ఈ భూమ్మీద ఎక్కడ నక్కినా ఉగ్రవాదులు తప్పించుకోలేరని, వారిని వేటాడతామని, ఇళ్లలోకి వెళ్లి మరీ హతమారుస్తామని సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి జరిగిన నష్టానికి మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
నాలుగు దశాబ్దాలపాటు ఉగ్రవాదం పట్ల అనుసరించిన ఉదాసీన వైఖరి ఇక ఎంతమాత్రమూ ఉండబోదన్నారు. ఇప్పడు తామేం చేసినా ఎన్నికలకు ముడిపెడుతున్నారని, 2016లో మెరుపుదాడులు చేసినప్పుడు ఏ ఎన్నికలు లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తనకు పదవీ వ్యామోహం లేదని, దేశ ప్రజల భద్రతే తనకు అన్నింటికంటే ముఖ్యమని, అందుకోసం ఏమైనా చేస్తానని ప్రధాని స్పష్టం చేశారు.