Hyderabad: హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. నేటి నుంచే అందుబాటులోకి
- నేటి సాయంత్రం మియాపూర్-2 డిపో నుంచి ప్రారంభం
- తొలి విడతలో 40 బస్సులు
- ప్రస్తుతం విమానాశ్రయ రూట్లకే పరిమితం
హైదరాబాద్ రోడ్లపై నేటి నుంచి ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా పర్యావరణ సహిత బస్సులను తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో భాగంగా 40 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మియాపూర్- 2 డిపో, కంటోన్మెంట్ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్ విమానాశ్రయ రూట్లలో నడపనున్నారు. ఇప్పటికే ఈ బస్సులు విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తి చేశాయి. నేటి సాయంత్రం మియాపూర్-2 డిపోలో వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం ఏసీ బస్సుల్లో వసూలు చేస్తున్న చార్జీలనే ఈ బస్సుల్లోనూ వసూలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి నగరంలోని ఇతర రూట్లకు వీటిని విస్తరించనున్నట్టు తెలిపారు.