paruchuri: అందుకే కోడి రామకృష్ణతో ఆ సినిమాలు చేయలేకపోయాము: పరుచూరి గోపాలకృష్ణ
- ఆ రెండు కోడి రామకృష్ణ సినిమాలు
- అన్నయ్యకి కోపం వచ్చేసింది
- ఆ నిర్మాత అలా అన్నాడు
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ .. ఇటీవల మరణించిన దర్శకుడు కోడి రామకృష్ణ గురించి ప్రస్తావించారు. "కోడి రామకృష్ణ ముందుగా మా అన్నయ్యకి పరిచయం. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' .. 'తరంగిణి'కి అన్నయ్య పనిచేశాడు. నేను పాటలు రాస్తానని మా అన్నయ్య చెప్పడంతో నిర్మాత రాఘవగారు నన్ను పిలిపించారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' .. 'తరంగిణి' ఫస్టు వెర్షన్ రెడీ అయ్యాయి.
'నువ్వు నా రైటర్ వి కనుక నా దగ్గర భోజనం చేస్తావు .. మీ తమ్ముడు ఎక్కడ భోజనం చేస్తాడు?' అని నిర్మాత రాఘవగారు అన్నయ్యతో అన్నారు. 'సర్లే నువ్వు వెళ్లరా ..' అని మా అన్నయ్య అని ఉంటే కనుక నేను బయటికి వెళ్లి ఎక్కడో తినేవాడిని. ఆ సినిమాలకి రచయితగా అన్నయ్య అలాగే కొనసాగేవాడు. అయితే, ఆ మాటతో మా అన్నయకి బాగా కోపం వచ్చేసింది. 'నా తమ్ముడు ఎక్కడ భోజనం చేస్తాడని అడిగిన ఆఫీసులో నేను భోజనం చేయను' అని చెప్పేసి నన్ను తీసుకుని బయటికి వచ్చేశాడు. అలా ఆ రెండు సినిమాలను మేము కోల్పోవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.