Andhra Pradesh: డేటాపై వస్తున్న ఆరోపణలతో మాకు సంబంధం లేదు: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి
- ఐటీ గ్రిడ్స్ వద్ద లభ్యమైన డేటా పబ్లిక్ డొమైన్ లోదే
- ఓటర్ జాబితా అందరికీ అందుబాటులో ఉంటుంది
- ఇందులోని వివరాలు ఎవరైనా తీసుకోవచ్చు
ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభ్యమైన డేటా పబ్లిక్ డొమైన్ లోదేనని, ఓటర్ జాబితా అందరికీ అందుబాటులో ఉంటుందని, ఇందులో ఉన్న వివరాలను ఎవరైనా తీసుకునే వీలుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. డేటాపై వస్తున్న ఆరోపణలతో తమకు సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన ఈసీ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు, సస్పెన్షన్ వేటు వేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఫారం-7 దరఖాస్తుల గురించి ద్వివేది ప్రస్తావించారు. ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, 74 నియోజకవర్గాల్లో 10 వేల ఓట్లే తొలగించామని, ఇంకా 101 నియోజకవర్గాల్లో తనిఖీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ ల నమోదు తర్వాత ఫిర్యాదులు తగ్గాయని, వారం రోజుల క్రితం వరకు రోజుకు 1.5 లక్షల ఫారం-7 దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు రోజుకు 300-400 మాత్రమే వస్తున్నాయని అన్నారు. ఫారం-7 కింద నకిలీ దరఖాస్తులు వచ్చాయి కానీ, ఓట్లు తొలగించలేదని, సీడాక్ నుంచి సర్వర్ సమాచారం వచ్చాక పోలీసులకు వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
వదంతులు నమ్మి ఓటర్లు ఆందోళన చెందొద్దని సూచించారు. కొత్త ఓట్లలో డూప్లికేట్ ఓట్లను, చనిపోయిన వారిని గుర్తించామని, గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీకి ఓటర్ల జాబితా ఇచ్చినట్టు చెప్పారు. ఓటర్ల జాబితా పబ్లిక్ డాక్యుమెంట్, అందులో ఫొటోలు ఉండవని, తెలంగాణ పోలీసులు సమాచారం కోరితే ఈసీ స్పందిస్తుందని, ఆరు లక్షల ఫారం-7 దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి ఉందని ద్వివేదీ వివరించారు.