Social Media: ఇది న్యూస్ యాంకర్ల 'అతి'కి పరాకాష్ట!
- టెర్రస్ మీదికెళ్లి వార్తలు చదివిన ఘనులు
- జీరో కాస్ట్ స్టూడియో అని పేరు
- కొరియాలో విడ్డూరం
ఇటీవల కాలంలో కొన్ని మీడియా చానళ్లలో యాంకర్లు చేసే అతి చూడనలవిగాదు! సంఘటనలకు అనుగుణంగా డ్రెస్సప్ అవడం... నిజంగానే సీన్ లో ఉన్నారేమో అని భ్రమింపజేయడానికి అడ్డమైన పాట్లు పడడం బాగా ఎక్కువైంది! మనదేశంలోనే కాదు అనేక దేశాల్లో ఈ ఓవరాక్షన్ కనిపిస్తోంది. కొరియాలో మోడ్రన్ బ్రాడ్ కాస్ట్ చానల్ (ఎంబీసీ) న్యూస్ యాంకర్లు కూడా ఈ కోవలోకే వస్తారు. మితిమీరినతనానికి పరాకాష్ట అని చెప్పాల్సిన సంఘటనలో వాళ్లే ప్రధాన పాత్రధారులయ్యారు! సోషల్ మీడియాలో ఇప్పుడిది వైరల్ అవుతోంది.
సాధారణంగా న్యూస్ రీడర్లు స్టూడియోలో కూర్చుని వార్తలు చదువుతారు. కానీ ఎంబీసీ సిబ్బంది తమ బిల్డింగ్ టెర్రస్ పై కూర్చుని వార్తలు చదివారు. బ్యాక్ గ్రౌండ్ లో సిటీ ప్రాపర్టీస్ కనిపిస్తుండగా ఓపెన్ ఎయిర్ పద్ధతిలో న్యూస్ చదివి దిగ్భ్రాంతి కలిగించారు. కొన్నిరోజుల క్రితం వియత్నాంలో డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటీ జరిగిన సందర్భంగా ఈ 'అతి' జరిగింది. అది కూడా టెర్రస్ చివరిభాగంలో కూర్చుని చదవడం వారి మూర్ఖ ప్రయత్నానికి నిదర్శనం. పైగా దానికి జీరో కాస్ట్ న్యూస్ రీడింగ్ అని పేరొకటి!
స్టూడియోలో న్యూస్ రీడింగ్ అంటే గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్స్... ఇలా చాలా ఖర్చుంటుంది. ఓపెన్ ఎయిర్ లో అయితే ఈ ఖర్చంతా ఉండదని ఎంబీసీ న్యూస్ రీడర్లు భావించారు. అయితే, తుపానో, సుడిగాలో వస్తే పరిస్థితి ఏంటన్నదానికి ఎంబీసీ వారి నుంచి జవాబులేదు!