Pawan Kalyan: వైసీపీలా మోసపూరిత హామీలు ఇవ్వలేను.. టీడీపీతో కలిసేది లేదు: పవన్
- వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే భయమేస్తోంది
- వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు
- స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేయొద్దు
రానున్న ఎన్నికల్లో తాను ఎవరితో కలిసి ముందుకు వెళ్లేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. దిగజారుడు రాజకీయాలను తిప్పికొట్టేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చిన పవన్.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతోనే కలిసి వెళ్తాను తప్పితే టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే తనకు భయమేస్తోందని, దానిని అమలు చేయాలంటే కనీసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని అన్నారు. వైసీపీలా తాను మోసపూరిత హమీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. ఏవైతే నిజాయతీగా చేయగలనో, ఏవైతే అమలు చేయడానికి వీలవుతుందో అటువంటి హామీలు మాత్రమే ఇస్తానని పవన్ అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ‘డేటా యుద్ధం’పై మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి మొక్కుతున్నానని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేయొద్దని కోరారు.