MAA: 'మా' ఎన్నికల్లో నేను గెలిస్తే ఏం చేస్తానంటే... మేనిఫెస్టో విడుదల చేసిన సినీ నటుడు నరేశ్!
- 10వ తేదీన 'మా' ఎన్నికలు
- వయసు పైబడిన వారికి రూ. 5 వేల పెన్షన్
- అవకాశాల కోసం 'జాబ్ కమిటీ'
- వెల్లడించిన నరేశ్ ప్యానల్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు మార్చి 10న జరగనున్న నేపథ్యంలో, అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సీనియర్ నటుడు నరేశ్, తన మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ ప్యానల్ ను గెలిపించాలని సభ్యులకు విజ్ఞప్తి చేసిన ఆయన, నటీనటులంతా సంతోషకరమైన, హుందా జీవితాన్ని గడిపేలా చూస్తామని, అందుకుగాను, వయసు పైబడిన కళాకారులకు నెలకు రూ. 5 వేలు పెన్షన్ ఇస్తామని, వారికి వైద్య, బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు.
తమను తాము వెండితెరపై మంచి పాత్రల్లో చూసుకోవాలని భావించే వారి కోసం 'జాబ్ కమిటీ'ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు లభించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కాగా, ఈ ఎన్నికల్లో జీవితా రాజశేఖర్, నరేష్ తదితరులు ఓ ప్యానల్ గా, నటులు శ్రీకాంత్, శివాజీరాజా తదితరుల టీమ్ మరో ప్యానల్ గా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.