Chandrababu: అచ్చోసిన ఆంబోతులు పెరిగిపోయాయి... అణచి చూపిస్తా: చంద్రబాబు నిప్పులు!
- ఆంబోతులను ఎలా అణచాలో నాకు తెలుసు
- ఆంబోతులకు నాయకుడు జగనే
- ఏమరపాటుగా ఉంటే దొంగల చేతుల్లోకి రాష్ట్రం
- టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు
రాష్ట్రంలో అచ్చోసిన ఆంబోతుల సంఖ్య పెరిగిపోయిందని, వాటిని ఎలా అణచాలో తనకు తెలుసునని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'ఎలక్షన్ మిషన్ 2019'పై టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఆంబోతులకు నాయకుడిగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఓట్ల తొలగింపు కుట్రలో ఏ1 నిందితుడు వైఎస్ జగనేనని, ఫామ్-7ను దుర్వినియోగం చేశామని జగన్ స్వయంగా ఒప్పుకోవడమే ఇందుకు సాక్ష్యమని అన్నారు. తప్పులు చేసేందుకు ఫామ్ - 7 వాడటం నేరమని, దీనిపై కేసు విచారణను జగన్ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఓట్లు గల్లంతైన వారంతా జగన్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఇప్పటివరకూ 16 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష పూర్తయిందని వెల్లడించిన చంద్రబాబు, మిగతా 9 నియోజకవర్గాల సమావేశాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా రాష్ట్రం దొంగల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరించిన ఆయన, టీడీపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. వైసీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందునే రాష్ట్రానికి సమస్యలు పెరిగాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
తాను త్వరలోనే 25 వేల మంది సేవామిత్రలతో భేటీ అవుతానని, వారందరికీ అవకాశాలు ఇచ్చి మంచి నేతలుగా తీర్చిదిద్దుతానని, ఆ బాధ్యతను స్వయంగా తానే మోస్తానని చంద్రబాబు అభయం ఇచ్చారు.