KTR: కేటీఆర్, జగన్ ల భేటీ తర్వాతే డేటా చోరీకి ప్లాన్ జరిగింది: దేవినేని ఉమామహేశ్వరరావు
- జగన్ కు అధికార పిచ్చి పట్టుకుంది
- టీఆర్ఎస్, ఎంఐఎంలతో కలసి కుట్రలకు పాల్పడుతున్నారు
- ఫామ్ 7 దరఖాస్తులను తామే పెట్టామని జగన్ ఒప్పుకున్నారు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ కు అధికార పిచ్చి పట్టుకుందని, అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. వైసీపీ దుష్ట పన్నాగాలకు టీఆర్ఎస్, ఎంఐఎంలు సహకరిస్తున్నాయని ఆరోపించారు. ఓట్లను అక్రమంగా తొలగించేందుకు యత్నిస్తున్న వైసీపీని... ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు.
లోటస్ పాండ్ లో కేటీఆర్, జగన్ లు సమావేశమయిన తర్వాతే డేటా చోరీకి ప్లాన్ జరిగిందని దేవినేని తెలిపారు. ఫామ్ 7 దరఖాస్తులను తామే పెట్టామని జగన్ ఒప్పుకున్నారని... ఆయనపై ఎన్నికల సంఘం ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ వాడుతున్న భాష చాలా నీచంగా ఉందని మండిపడ్డారు. ఎలాంటి అజెండా లేని జగన్... పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందని... రిజర్వ్ బ్యాంకే ఈ విషయాన్ని ప్రకటించిందని చెప్పారు.