Pakistan: ఎన్నికల వేళ ఆయనకు అలవాటే... ప్రధాని మోదీపై అశోక్ గెహ్లాట్ విమర్శలు
- ఓడిపోతామనిపించినప్పుడల్లా పాకిస్థాన్ సాయం తీసుకుంటారు
- గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయన చేసింది ఇదే
- 350 మంది ఉగ్రవాదులను చంపామని అవాస్తవాలు ప్రచారం
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ నిర్వహించిన సర్జికల్ దాడులు, అనంతర పరిణామాలపై కాంగ్రెస్ తన విమర్శనాస్త్రాలను విడిచిపెట్టడం లేదు. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు, ఓడిపోతామన్న భయం ఉన్నప్పుడు ఆయనకు ఇటువంటివి అలవాటే. ఆ సమయంలో పాకిస్థాన్ సాయం తీసుకుంటారు’ అని విమర్శించారు.
పుల్వామా దాడి అనంతరం భారత్ జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో మొత్తం 350 మంది ఉగ్రవాదులు చనిపోయారని భావిస్తున్నారు. మన వైమానిక దళం ధైర్యసాహసాలకు దేశం మొత్తం జేజేలు పలకగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం క్రెడిట్ ను దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది బీజేపీ రాజకీయ ‘యుద్ధం’ అంటూ దుమ్మెత్తి పోస్తోంది. ఈ విమర్శలకు ఇప్పుడు గెహ్లాట్ కూడా తోడయ్యారు. గుజరాత్ ఎన్నికలకు ముందు కూడా మోదీ ఇటువంటి రాజకీయమే చేశారని ధ్వజమెత్తారు. 350 మంది ఉగ్రవాదులను చంపేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలన్నారు.
‘సైనికుల త్యాగాలను నేను శంకించడం లేదు. బీజేపీ మోసాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. మోదీ 350 మంది చనిపోయారంటారు. అమిత్ షా 250 మంది అంటారు. వైమానిక దళం చీఫ్ ఎంతమంది చనిపోయారో మేము లెక్కించలేదంటారు. మరో మంత్రి అహ్లూవాలియా దాడుల్లో ఎవరూ చనిపోలేదు. కేవలం పాకిస్థాన్‌ను బెదిరించడానికే ఇది చేశాం అని చెబుతున్నారు. ఇలా ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలతో జనాలను కన్ప్యూజ్ చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కశ్మీర్లో 876 మంది ఉగ్రవాదుల్ని చంపినట్టు బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని, యూపీఏ హయాంలో మొత్తం 4,239 మందిని హతమార్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని గెహ్లాట్ కోరారు. దేశభద్రత విషయంలోనూ అనవసర రాజకీయాలు వద్దని హితవు పలికారు.