Jawahar: అసలు దొంగ వైఎస్ జగనే... సాక్ష్యాలివిగో: ఏపీ మంత్రి జవహర్
- టీడీపీని అధికారానికి దూరం చేయడమే మోదీ టార్గెట్
- జగనే స్వయంగా ఫామ్-7పై మాట్లాడారు
- దీన్నే సాక్ష్యంగా తీసుకుని కేసు పెట్టాలన్న జవహర్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కుట్ర పన్నారని, అందులో భాగంగానే టీడీపీ కార్యకర్తలు ఎవరన్న విషయాన్ని తెలుసుకుని వారి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి జవహర్ ఆరోపణలు గుప్పించారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థనే అప్రతిష్టపాలు చేస్తున్నారని, ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఫామ్-7ను తాము విరివిగా వాడినట్టు జగన్ స్వయంగా ప్రకటించారని గుర్తు చేస్తూ, ఫామ్-7ను దుర్వినియోగం చేసిన జగన్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గాల్లో ఓట్లను తొలగిస్తున్నారని, జగనే డేటా చోరీ, ఓట్ల తొలగింపులో నిందితుడనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావలని జవహర్ ప్రశ్నించారు. బ్లూఫ్ రాగ్ అనే కంపెనీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించిందని, ప్రధాని, కేసీఆర్ ఇప్పుడా కంపెనీతో కుట్ర పన్ని జగన్ కు అనుకూలంగా పని చేస్తున్నారని జవహర్ ఆరోపించారు.