Andhra Pradesh: డేటా చోరీ కేసులో ఓ కీలక వ్యక్తి ఉన్నారు..ఆ వ్యక్తిని కోడ్ భాషతో పిలుస్తున్నారు: సీపీ అంజనీకుమార్
- రహస్య సమాచారం ‘ఐటీ గ్రిడ్’ సర్వర్ లో చేరింది
- ‘ఐటీ గ్రిడ్’ సర్వేయర్లు ఓటర్లకు ఫోన్ చేస్తారు
- ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగి తెలుసుకుంటారు
హైదరాబాద్ లో డేటా చోరీ కేసు వ్యవహారంపై దర్యాప్తునకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరించారు. హైదరాబాద్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రహస్యంగా ఉండాల్సిన సమాచారం ‘ఐటీ గ్రిడ్’ కు చెందిన సర్వర్ లో చేరిందని, దీని ద్వారా ఆ సమాచారాన్ని ‘సేవామిత్ర’ వాడుకుంటోందని తెలిపారు. సర్వర్లలో నిక్షిప్తం చేసిన డేటా ఇవ్వాలని అమెజాన్ సంస్థను కోరామని, ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు పంపినట్టు చెప్పారు.
క్షేత్ర స్థాయిలో ఆధార్ నెంబర్, విద్య, సామాజిక వర్గం వివరాలు సేకరిస్తారని, ఆ వివరాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ పరిశీలిస్తుందని, సేవా మిత్ర’ వెబ్ సైట్ లో బూత్ కన్వీనర్, డ్యాష్ బోర్డు వివరాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తారని, ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగి తెలుసుకుని, సర్వేయర్లు ఈ సమాచారాన్ని టీడీపీ బూత్ లెవెల్ అధికారులకు చేరవేస్తారని చెప్పారు. ఓటర్ అభిప్రాయం, సదరు ఓటర్ అక్కడే ఉంటున్నారా? లేదా? అన్న దానిపై సర్వే చేస్తున్నారని, అటువంటి వారిని లక్ష్యంగా చేస్తూ సర్వే చేస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ లో నేరం జరిగింది కనుక, ఇక్కడే కేసు నమోదు చేశామని, ఐపీసీ 420,490,467,468, 471,120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, నిందితుడు అశోక్ ను త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక వ్యక్తి ఉన్నారని, ఆ వ్యక్తిని కోడ్ భాషతో పిలుస్తున్నారని, ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నామని, ఆ కీలక వ్యక్తి ఎవరన్నది త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు.