Andhra Pradesh: కేసీఆర్ కుటుంబానికి జగన్ సామంతరాజుగా మారారు: టీడీపీ నేత కళావెంకట్రావు
- జగన్ కు టీడీపీ బహిరంగ లేఖ
- వైసీపీ, టీఆర్ఎస్ వి వికృత రాజకీయాలు
- దొంగ ఓట్లు- దొంగనోట్ల బ్యాచ్ ఒక చోటుకు చేరింది
దొంగ ఓట్లు- దొంగనోట్ల బ్యాచ్ ఒక చోటుకు చేరినట్టు జగన్-కేటీఆర్ మధ్య దోస్తీ కుదిరిందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ బహిరంగ లేఖ రాసింది. మోదీ ఆడిస్తున్న ఆటలో జగన్, కేసీఆర్ పావులుగా మారారని, వికృత రాజకీయాలతో వ్యవస్థలకే కళంకం తెచ్చేలా వైసీపీ, టీఆర్ఎస్ వైఖరి ఉందని దుయ్యబట్టారు.
ఏపీ ప్రతిష్టను దిగజార్చేందుకు వైసీపీ కుట్రలు, కుయుక్తులు పన్నుతోందని, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందంటూ నిప్పులు చెరిగారు. ఆన్ లైన్ లో ఉన్న ఓటర్ జాబితాను ఎవరైనా వాడుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కళావెంకట్రావు గుర్తుచేశారు.
టీడీపీ కార్యకర్తల డేటాను జగన్ కు ఇవ్వడమేనా రిటర్న్ గిఫ్ట్? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి జగన్ సామంతరాజుగా మారారని, ఏపీపై కత్తి కట్టిన కేసీఆర్, మోదీతో జగన్ కలవడం రాష్ట్ర ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. ఈసీ ప్రకటించిన ఓటర్ల జాబితాను పార్టీలన్నీ వాడుకుంటున్నాయని, ఈ డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ వాడుకుంటే తప్పు ఎలా అవుతుంది? ఓటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎలా తొలగిస్తుంది? అని ఆ లేఖలో జగన్ ని కళా వెంకట్రావు ప్రశ్నించారు.