Pawan Kalyan: టీడీపీ అధికార ప్రతినిధి యామినికి పవన్ వార్నింగ్!
- నా వ్యక్తిగత జీవితం గురించి మీకేం తెలుసు?
- పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదు
- మర్యాదగా జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి
తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. పల్నాడులో జరిగిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ.. తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించారు. యామినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయాన్ని ప్రస్తావించిన పవన్.. నాడు మీ జెండాలు మోసిన వారిపై కేసులు పెట్టి చచ్చిపోయేలా కొడతారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను చాలా గౌరవంగా మాట్లాడతానని, అందులో తప్పు ఉంటే ఖండించాలని, అంతే తప్ప తన వ్యక్తిగత జీవితంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండదని యామినిని ఉద్దేశించి హెచ్చరించారు. అసలు తన వ్యక్తిగత జీవితం గురించి వారికేం తెలుసని ప్రశ్నించారు. తనను విమర్శించేంత విలువలు మీకు ఉన్నాయా? అని నిలదీశారు.
తనను విమర్శించినందుకు తమ కార్యకర్తలు ఒక్క మాట అంటేనే కేసులు పెట్టించి కొడుతున్నారని, ప్రజాస్వామ్యం అంటే ఇది కాదని అన్నారు. అయినా, ఇటువంటి గొడవలకు పవన్ భయపడే రకం కాదన్నారు. మీరు హద్దులు దాటితే మేం కూడా దాటాల్సి వస్తుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
తాను ఏం మాట్లాడినా అందులో వాస్తవం ఉంటుందని పవన్ పేర్కొన్నారు. సర్పంచ్‌గా పోటీ చేయని వ్యక్తి మంత్రి అయ్యాడనడంలో వాస్తవం ఉందన్నారు. ఇది 2009 కాదని, 2019 అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలపై పెట్టిన కేసుల్ని మర్యాదగా ఉపసంహరించుకోవాలని, లేదంటే యుద్ధం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.