Andhra Pradesh: జైలు బయటే కాపుకాసిన విశాఖ పోలీసులు.. బయటకు రాగానే మహిళా సంఘం కార్యకర్త అనూష అరెస్ట్!
- మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఆరోపణ
- గతేడాది డిసెంబరులో అక్కాచెల్లెళ్ల అరెస్ట్
- జైలు నుంచి బయటకు రాగానే చెల్లెలు మళ్లీ అరెస్ట్
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని తిమ్మయ్యపాలేనికి చెందిన ఆత్మకూరు భవానీ (38), ఆత్మకూరు అన్నపూర్ణ (32), ఆత్మకూరు అనూష (26) అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్‌లో ఉంటున్న వీరు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ గతేడాది డిసెంబరులో జి.మాడుగుల పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. తాజాగా వీరిలో ఇద్దరికి బెయిలు లభించడంతో బుధవారం విశాఖపట్టణం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, వారు బయటకు రాగానే విశాఖ పోలీసులు వీరిలో అనూషను అదుపులోకి తీసుకున్నారు.
బెయిలుపై బుధవారం భవానీ, అనూష విడుదల కాగా, అనూషపై మరో కేసు కూడా ఉందని చెప్పిన పోలీసులు అటునుంచి అటే ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనూష అరెస్ట్‌పై ఏపీ, తెలంగాణ పౌరహక్కుల సంఘాలు స్పందించాయి. చైతన్య మహిళా సంఘం కార్యకర్త అయిన అనూష అరెస్ట్ అక్రమమని, వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.