Mahabubabad District: కిరాతకుడు...పదమూడేళ్లలో పన్నెండు హత్యలు

  • డబ్బు కోసం దారుణం
  • 2003 నుంచి ప్రారంభం
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెలుగు చూసిన నేరం

అతనో రోజు కూలీ. అప్పుడప్పుడూ ఆటో కూడా నడిపి పొట్ట పోషించుకునేవాడు. వచ్చే అరకొర ఆదాయంతో జీవితం నెట్టుకు రావడం కష్టంగా ఉండడంతో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. తన ఆటోలోని ప్రయాణికులనే ఇందుకు ఉపయోగించుకునే వాడు. చేతిలో డబ్బుల్లేని సమయంలో ఎవరైనా ఒంటరిగా ఆటో ఎక్కి, వారి వద్ద నగలు, బంగారం, ఖరీదైన వస్తువులు ఉన్నట్టయితే వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసేవాడు. చోరీలకు పాల్పడేవాడు. ఇలా పదిహేనేళ్లలో పన్నెండు హత్యలకు పాల్పడ్డాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం చొక్కంపేటకు చెందిన ఎం.డి.యూసుఫ్‌ అలియాస్‌ ఇసాక్‌ అలియాస్‌ ఇమాయత్‌ అలియాస్‌ మహ్మద్‌ అలియాస్‌ జానీ (31) కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఆటో నడిపేవాడు. పదిహేనేళ్ల వయసులోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఇందుకు ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని 2003లో అతన్ని చంపేశాడు.

అలా ప్రారంభమైన అతని హత్యల పరంపర ఈ ఏడాది నవాబుపేటలో గొర్రెల కాపరి వరకు కొనసాగింది. రాజాపూర్‌ మండలం చొక్కంపేటకు చెందిన జమలాపూర్‌ బాలరాజ్‌ అలియాస్‌ కటికె బాలరాజ్‌ (52)ను తక్కువ ధరకు గొర్రెలు ఇప్పిస్తానని చెప్పి తీసుకు వెళ్లాడు. నవాబుపేట మండలం కానుగకుచ్చతండా పరిసరాల్లో కారంపొడి చల్లి అతన్ని హత్యచేశాడు. అతని వద్ద ఉన్న రూ.14 వేల నగదు, సెల్‌ఫోన్‌ ఎత్తుకుపోయాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు జానీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఇతని హత్యోదంతాలు విని పోలీసులే నోళ్లు వెళ్ళబెట్టారు. 2006, 2009, 2012, 2013లో షాద్‌నగర్‌ పరిధిలో నాలుగు హత్యలు, 2017లో వికారాబాద్‌ పరిధిలో రెండు, 2018లో రాజాపూర్‌, కొత్తూరు సమీపంలోని జహంగీర్‌పీర్‌ దర్గా వద్ద రెండు హత్యలు చేశాడు. ద్విచక్ర వాహనాల చోరీ, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో మూడు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

  • Loading...

More Telugu News