Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కలకలం.. ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టిన భద్రతాబలగాలు!
- హంద్వారా జిల్లాలోని క్రల్ గుండ్ ప్రాంతంలో ఘటన
- నిఘా వర్గాల సమాచారంతో బలగాల కార్డన్ సెర్చ్
- భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
జమ్మూకశ్మీర్ లోని హంద్వారా జిల్లాలో ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భద్రతాబలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఎన్ కౌంటర్ లో ఆయుధాలతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
హంద్వారాలోని క్రల్ గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఆర్మీ, కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు ఈరోజు ఉదయాన్నే ఇక్కడకు చేరుకున్నాయి. క్రల్ గుండ్ ప్రాంతాన్ని చుట్టుమట్టి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే బలగాల కదలికలను గుర్తించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఘటనాస్థలి నుంచి నిషేధిత సాహిత్యంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులు తప్పించుకుని ఉండొచ్చన్న అనుమానంతో కార్డన్ సెర్చ్ ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.