Ranchi: సొంత మైదానంలో ధోనీకిదే చివరి వన్డే!
- రేపు రాంచీలో మూడో వన్డే
- ఆపై ఏడాదిన్నర తరువాతే ఇంకో పోరు
- ఈలోగా ధోనీ వన్డేల నుంచి రిటైర్ అయ్యే అవకాశం
జార్ఖండ్ రాజధాని రాంచీలో రేపు ఆస్ట్రేలియాతో మూడో వన్డే జరుగనుండగా, మాజీ కెప్టెన్, కీపర్ ఎంఎస్ ధోనీకి తన హోమ్ గ్రౌండ్ లో ఇదే చివరి మ్యాచ్ కావచ్చని తెలుస్తోంది. రేపటి మ్యాచ్ తరువాత, రాంచీలో ఇంకో మ్యాచ్ జరగాలంటే, మరో ఏడాదిన్నర సమయం వరకూ పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టెస్టుల నుంచి రిటైర్ మెంట్ ను ప్రకటించిన ధోనీ, రానున్న వరల్డ్ కప్ కోసమే వన్డేల్లో కొనసాగుతున్నాడు.
తనలో సత్తా కాస్తంత తగ్గినా, నిలకడగా రాణిస్తూ, జట్టులోని అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, కెప్టెన్ కోహ్లీకి సలహాలు, సూచనలు ఇస్తున్న ధోనీ, ప్రపంచకప్ తరువాత వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశాలు అధికంగా ఉన్నాయని క్రీడా పండితులు భావిస్తున్నారు. అదే జరిగితే, రేపటి మ్యాచ్ రాంచీలో ధోనీ ఆడే చివరి వన్డే అవుతుంది. ఇక ఇదే విషయాన్ని నమ్ముతున్న రాంచీ ప్రజలు, తమ అభిమాన ఆటగాడికి సొంత మైదానంలో ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కాగా, రాంచీ మైదానంలో మీడియా, వీఐపీ బాక్స్ లు ఉండే ఉత్తరం వైపు స్టాండ్ కు ధోనీ పేరు పెట్టాలని నిర్ణయించిన జీఎన్సీఏ, దాన్ని ప్రారంభించాలని ధోనీని కోరగా, తన సొంత ఇంట్లో తాను ఆవిష్కరించేది ఏముంటుందని ఆయన నిరాకరించిన సంగతి తెలిసిందే.