Andhra Pradesh: ‘ఓట్ల తొలగింపు’పై టీడీపీ సీరియస్.. కృష్ణా జిల్లా కలెక్టర్ కు మంత్రి దేవినేని, టీడీపీ నేతల ఫిర్యాదు!
- విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ తో భేటీ
- వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు
- ఫామ్-7 ను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ తో ఇటీవల సమావేశమైన ప్రతిపక్ష నేత జగన్.. ఏపీలో జరుగుతున్న పరిస్థితులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఫామ్-7 ద్వారా తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను కలుసుకున్నారు.
టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఫామ్-7 ద్వారా తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.