Chandrababu: అభిమానం ఉంటే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తా, భోజనం పెడతా!: అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు

  • అభ్యర్థుల ఎంపికలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడను
  • కుప్పం కన్నా ముందు పులివెందులకు నీరు ఇచ్చాం
  • ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను వివరించండి

టీడీపీ టికెట్లను ఆశిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసులో మాటను స్పష్టంగా తెలియజేశారు. అభిమానం ఉంటే ఇంటికి పిలిచి కాఫీ ఇస్తానని, భోజనం పెడతానని... అంతే తప్ప అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని చెప్పారు. ధర్మపీఠంపై కూర్చున్న తాను ధర్మాన్నే ఆచరిస్తానని తెలిపారు. ఎన్నో విధాలుగా కాచి, వడబోసిన తర్వాతే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తానని చెప్పారు. అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ నేతలతో సమీక్ష సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికల్లో దుష్ట పార్టీ వైసీపీతో మనం పోటీ పడుతున్నామని... ఈ నేపథ్యంలో, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. నదుల అనుసంధానం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని... కుప్పంకన్నా ముందు పులివెందులకు నీరు ఇస్తానని చెప్పానని... ఇచ్చిన మాట మేరకు గండికోటకు నీళ్లు తెచ్చి, పులివెందులకు ఇచ్చామని చెప్పారు.

ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని... అలా చేస్తే 175 స్థానాలు మనవేనని అన్నారు. జగన్ కు రాజకీయం చేతకాకే బీహారీ కన్సల్టెంట్ (ప్రశాంత్ కిశోర్)పై ఆధారపడ్డారని ఎద్దేవా చేశారు. దుష్ట శక్తులన్నీ ఏకమయ్యాయని... టీడీపీపై కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. టీడీపీ గెలిస్తే వాళ్ల ఆటలు సాగవనే భయం వారికి పట్టుకుందని చెప్పారు. ఎన్నికల వరకు మన ఆలోచనలన్నీ గెలుపుపైనే ఉండాలని సూచించారు.

  • Loading...

More Telugu News