masood azhar: నా ముందు అవేమీ పని చేయవు: పాకిస్థాన్ కు మసూద్ అజార్ వార్నింగ్
- నేను చనిపోయినట్టు వస్తున్న వార్తలన్నీ పుకార్లే
- ఒత్తిడి కింద పాక్ ప్రభుత్వం పని చేస్తోంది
- భారత్ జైల్లో ఉన్నప్పుడు నన్ను చిత్ర హింసలు పెట్టారు
జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చనిపోయాడంటూ వార్తలు వస్తున్న తరుణంలో... ఆయన మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అంతే కాదు పాకిస్థాన్ కు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పాడు. ఎంతకాలం బతకాలి, ఎప్పుడు చనిపోవాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడని తెలిపాడు.
ఒత్తిడి కింద పాక్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నాడు. జైషే మొహమ్మద్ తో అధికారులు చర్చలు జరిపారంటూ పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఒత్తిడితోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పాడు. ఇలాంటివి తన ముందు పని చేయవని చెప్పారు. జైష్ ను ఉన్నది ఉన్నట్టుగా పాక్ ప్రభుత్వం అంగీకరించాలని అన్నాడు.
మసీదులు, ముస్లింలపై పాక్ ప్రభుత్వం చేస్తున్న విచారణను వెంటనే నిలిపి వేయాలని మసూద్ హెచ్చరించాడు. పాకిస్థాన్ ముస్లిం దేశమని... మలాలా వంటి ఉదారవాదుల చేతుల్లోకి దేశాన్ని పోనివ్వరాదని అన్నాడు. భారత్ లో తాను జైల్లో ఉన్నప్పుడు తనను చిత్ర హింసలు పెట్టారని మండిపడ్డాడు. కశ్మీర్ లో భారత్ కు వ్యతిరేకంగా జీహాద్ మొదలు పెట్టాలని పిలుపునిచ్చాడు.