Andhra Pradesh: జనవరి 11 తర్వాత ఏపీలో ఒక్క ఓటు కూడా తొలగించలేదు: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
- ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలి
- ఫారం-7 దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్టు కాదు
- పోలీస్ కేసులు మొదలవ్వగానే నకిలీ దరఖాస్తులు ఆగిపోయాయి
జనవరి 11 తర్వాత ఏపీలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫారం-7 ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్టు కాదని, నకిలీ దరఖాస్తులపై పోలీస్ కేసులు మొదలవ్వగానే ఈ దరఖాస్తులు ఆగిపోయాయని అన్నారు.
ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదని, ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని సూచించారు. పార్టీల నేతలు ఫారం-7 పై ఈసీకి అభ్యంతరాలు చెబుతున్నారని, బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారని, ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని కోరారు. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని, 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటు హక్కు లేదని గుర్తించామని, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పని చేస్తుందని ద్వివేది స్పష్టం చేశారు.