Cricket: టీమిండియా ఆటగాళ్లకు తన ఫార్మ్ హౌస్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చిన ధోనీ
- సహచరుడి ఆతిథ్యానికి ముగ్ధుడైన కోహ్లీ
- విందును ఆస్వాదించిన జట్టు సభ్యులు
- పొంగిపొర్లిన ఆనందం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన స్వస్థలం రాంచీలో జట్టు సభ్యులకు పసందైన విందు ఇచ్చాడు. భారత్ మార్చి 8న ఆస్ట్రేలియా జట్టుతో రాంచీ వేదికగా మూడో వన్డే ఆడనుంది. అందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లు రాంచీ చేరుకున్నారు. అయితే, ధోనీ తన వాహనంలో టీమిండియా ఆటగాళ్లను ఎక్కించుకుని ఎయిర్ పోర్టు నుంచి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఫార్మ్ హౌస్ కు తీసుకెళ్లాడు. అన్నిరకాల కాంటినెంటల్, స్థానిక వంటకాలతో జట్టు సహచరుల అదిరిపోయే విందు ఏర్పాటు చేశాడు. ధోనీ ఉంటే ఎక్కడైనా నవ్వుల పంట అని చెప్పాలి. దానికితోడు విందు భోజనం కూడా ఉండడంతో ఆటగాళ్లు ఒత్తిళ్లన్నీ మర్చిపోయి హాయిగా ఆస్వాదించారు.
ధోనీ ఇచ్చిన విందుతో కెప్టెన్ కోహ్లీ ఆనందంతో పొంగిపోయాడు. "గతరాత్రి ధోనీ భాయ్ ఇచ్చిన విందు అద్భుతం. మంచి ఫుడ్ తిన్నాం, హాయిగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేశాం... మొత్తమ్మీద ఈ సాయంకాలం మేం ఆనందోత్సాహాలతో గడిపాం" అంటూ ట్వీట్ చేశాడు. ఇక, టీమిండియాలో కీలక బౌలర్ గా పేరుతెచ్చుకున్న లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా ధోనీ విందుపై స్పందించాడు. ధోనీతో పాటు ఆయన అర్థాంగి సాక్షి సింగ్ కు కూడా ధన్యవాదాలు తెలిపాడు.