Social Media: టి-సిరీస్ వర్సెస్ ప్యూడీపై... సబ్ స్క్రయిబర్ల కోసం ఆన్ లైన్ కుమ్ములాట!
- యూట్యూబ్ టాప్ ర్యాంక్ కోసం హోరాహోరీ
- నువ్వానేనా అంటున్న భూషణ్ కుమార్, జెల్ బెర్గ్
- నెటిజన్ల మద్దతు కోరిన టి- సిరీస్ అధినేత
కొంతకాలం క్రితం యూట్యూబ్ లో ప్యూడీ అనే గేమింగ్ చానల్ రికార్డు స్థాయిలో సబ్ స్క్రయిబర్లను కలిగి ఉండేది. ఇప్పటికీ ఆ స్వీడిష్ యూట్యూబ్ చానలే నంబర్ వన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్యూడీపై సబ్ స్క్రయిబర్ల సంఖ్య 8, 82, 85, 989. అయితే, దీనికి పోటీగా మరో యూట్యూబ్ చానల్ శరవేగంగా దూసుకురావడంతో యూట్యూబ్ లో సంకుల సమరానికి తెరలేచింది.
అప్పటివరకు యూట్యూబ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంగా దున్నేస్తున్న ప్యూడీపైకి గట్టిపోటీ ఇస్తున్న చానల్ భారతదేశానికి చెందినదే. ప్రఖ్యాత హిందీ మ్యూజిక్ ఆడియో సంస్థ టి-సిరీస్ కనీవినీ ఎరుగని రీతిలో ప్యూడీపైకి అత్యంత సమీపంలోకి వచ్చేసింది. ప్రస్తుతం టి-సిరీస్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య 8, 82, 39, 013. కేవలం 46 వేల సబ్ స్క్రయిబర్ల దూరంలో నిలిచిన టి-సిరీస్ యూట్యూబ్ లో నంబర్ వన్ ర్యాంక్ కోసం ఉరకలు వేస్తోంది.
ఈ క్రమంలో కొన్నాళ్లుగా రెండు దిగ్గజాల మధ్య ఆన్ లైన్ లో సబ్ స్క్రయిబర్ల కోసం వేట సాగుతోంది. ఎవరికి వారు తమదైన పంథాలో నెటిజన్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా, టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సబ్ స్క్రయిబర్ల కోసం పిలుపునిచ్చాడు. ఓ భారతీయ యూట్యూబ్ చానల్ నంబర్ వన్ రికార్డు కోసం ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చిందని, ఇది చారిత్రక సమయం అని పేర్కొన్నాడు. భారతీయ నెటిజన్లందరూ సహృదయంతో టి-సిరీస్ యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని రికార్డు సాధనలో పాలుపంచుకోవాలని భూషణ్ కుమార్ విజ్ఞప్తి చేశాడు.