prajashanti party: జగన్ కు మతి భ్రమించింది..చంద్రబాబు చేసింది సైబర్ క్రైమ్: కేఏ పాల్
- ‘ఫ్యాన్’, ‘హెలికాఫ్టర్’ గుర్తులు ఒకేలా ఉన్నాయట
- ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేశారు
- ఇలా ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం
అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర రాజకీయాల గురించే కాకుండా, సెలెబ్రిటీలపైనా ఆసక్తికర, సంచలన, హాస్యాస్పద ప్రకటనలు చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ‘ఫ్యాన్’, తమ పార్టీ ‘హెలికాఫ్టర్’కి చెందిన గుర్తులు ఒకేలా ఉన్నాయని ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని, వైసీపీ అధినేత జగన్ కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఇంత దిగజారిపోతారనుకోలేదు
ఈ సందర్భంగా డేటా చోరీ కేసు గురించీ ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు చేసింది సైబర్ క్రైమ్ అని, ప్రైవేట్ డేటా అంశంలో బాబు ఇంతగా దిగజారిపోతారనుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే, ఇటువంటి నేరాలకు అమెరికాలో అయితే 25 ఏళ్ల జైలు శిక్ష వేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే పథకాలు అమలు
తమ పార్టీకి చెందిన కో-ఆర్డినేటర్లను బెదిరించి ఇతర పార్టీల్లోకి లాగేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో రాబోయే ఎన్నికల ప్రచారం నిమిత్తం మూడు హెలికాఫ్టర్లు బుక్ చేశానని, తమ పార్టీని గెలిపిస్తే ఆంధ్రాను మరో అమెరికా చేస్తానంటూ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ పథకాలు అమలు చేస్తానని పాల్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.