Election Commission: ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్.. ఎనిమిది విడతల్లో పోలింగ్!
- ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా..
- మొత్తం ఏడెనిమిది విడతల్లో పోలింగ్
- తొలి విడతకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్
ఈ వారంలో ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. అనివార్య కారణాల వలన ఈ వారంలో కాకుంటే 12వ తేదీ లోపు పక్కాగా ప్రకటిస్తామని పేర్కొంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో మొత్తం ఏడెనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
మొదటి విడత ఎన్నికల కోసం ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ మధ్య వారంలో పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. కాగా, జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులున్న నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ విడుదలలో ఎటువంటి జాప్యం లేదని, ప్రధాని షెడ్యూలు ప్రకారం తాము పనిచేయబోమని, తమకంటూ ఓ షెడ్యూలు ఉందంటూ విపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. జూన్ 3తో 16వ లోక్‌సభ గడువు ముగియనుందని, ఆలోపు ఫలితాలు రావాల్సి ఉంటుందని ఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాబట్టి షెడ్యూలు విడుదలలో ఎటువంటి జాప్యం జరగడం లేదని వివరించారు.