Nalgonda District: నల్గొండ కాంగ్రెస్‌లో మిగిలేది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, ఎమ్మెల్యే కోమటిరెడ్డిలేనా?

  • టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఖాళీ అవుతున్న పార్టీ
  • చిరుమర్తి లింగయ్య కూడా జెండా పీకెయ్యడంతో షాక్‌
  • దిక్కుతోచని స్థితిలో అధినాయకులు

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ వ్యూహంతో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ విలవిల్లాడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికే కాంగ్రెస్‌ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టి మరీ టికెట్టు తెప్పించుకుని గెలిపించుకున్న చిరుమర్తి లింగయ్య కూడా పార్టీ మారిపోతుండడం మరో విశేషం.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వలసల విషయంలో హడావుడి చేసిన అధికార టీఆర్‌ఎస్‌ ఆ తర్వాత కొంతకాలం ఎందుకో మౌనం వహించింది. తాజాగా లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పథకానికి తెరతీసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వలలో చాలామంది ఎమ్మెల్యేలు పడ్డారు.

కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు కారెక్కారు. తాజాగా నకిరేకల్‌ ఎమ్మెల్యే లింగయ్య కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధం కావడంతో జిల్లా కాంగ్రెస్‌ను శాసిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షాక్‌ తగిలినట్టయింది. గడచిన ఎన్నికల్లో చిరుమర్తికి టికెట్టు ఇవ్వకుంటే తాను కూడా పోటీచేయనని కోమటిరెడ్డి బెట్టుచేసి మరీ టికెట్టు తెప్పించుకున్నారు. అటువంటి లింగయ్య పార్టీ మారడం పార్టీకే కాదు, వ్యక్తిగతంగా కోమటిరెడ్డి సోదరులకు గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి.

ప్రస్తుతం జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌, ఉత్తమకుమార్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. పీసీసీ పీఠం దక్కించుకునే పనిలో ఉన్న సోదరులు లోక్‌సభ ఎన్నికల నాటికి అధ్యక్షుడి మార్పు జరిగితేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకుంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ తమ గట్టిమద్దతుదారు లింగయ్యే కారెక్కడంతో వీరు డిఫెన్స్‌లో పడిపోయారు. ఇకపై మొదటి అంత దూకుడు ప్రదర్శించే అవకాశం వీరికి లేదన్న మాట రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. తాజా పరిణామాలతో నల్గొండ కాంగ్రెస్‌లో ఉత్తమకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే మిగిలారు. ఇక, భవిష్యత్తు ఏమిటో చూడాలి.

  • Loading...

More Telugu News